రేపే రెండో ట్వంటీ20 : సిరీస్‌ సమంపైనే దృష్టి

గురువారం, 26 ఫిబ్రవరి 2009 (19:24 IST)
బ్యాట్స్‌మెన్ల బాధ్యతారహి ఆటతీరుతో.. కివీస్‌తో జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్‌లో భారీ మూల్యమే చెల్లించుకున్న టీం ఇండియా, రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేసి, పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతోంది. కాగా, వెల్లింగ్టన్‌లో శుక్రవారం న్యూజిలాండ్ జట్టుతో రెండో ట్వంటీ20ను టీం ఇండియా ఆడనుంది.

బుధవారం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఓటమి భారంతో కసిగా ఉన్న ధోనీ సేన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సన్నద్ధంగా ఉంది.

భారత జట్టు తొలి మ్యాచ్‌లో విఫలం అయిన బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ ప్రవీణ్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మినహా... టీం ఇండియా, కివీస్ జట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మ్యాచ్ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సెట్‌ మ్యాక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

వెబ్దునియా పై చదవండి