2010వరకు జింబాబ్వే పర్యటన రద్దు: కివీస్

బుధవారం, 25 ఫిబ్రవరి 2009 (11:01 IST)
వచ్చే 2010 సంవత్సరం వరకు జింబాబ్వే పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. కివీస్ క్రికెట్ జట్టు వచ్చే జులై నెలలో జింబాబ్వేలో పర్యటించాల్సి వుంది. అయితే కివీస్ ప్రధాని ఝాన్ కీ వ్యతిరేకిస్తుండటంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్టు కివీస్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీనిపై న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జస్టిన్ వాఘన్ మాట్లాడుతూ, జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశంలో ఇరు బోర్డుల ప్రతినిధులు పర్యటన రద్దుకు అంగీకరించారని చెప్పారు.

ఈ పర్యటనకు కివీస్ ప్రభుత్వ మద్దతు లభించక పోవడంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జింబాబ్వేలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అక్కడకు క్రికెట్ జట్టును పంపించడం మంచిది కాదని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల 2010 వరకు తమ పర్యటనను రద్దు చేసుకున్నట్టు వాఘన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి