రాబోయే ప్రపంచకప్‌ను సాధించి తీరుతామని పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. శ్రీలంక జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసిన అనంతరం యూనిస్ మాట్లాడుతూ... తన సారథ్యంలోని పాక్ జట్టు వరల్డ్ కప్‌ను సాధిస్తుందని ఆశాభావంతో అన్నాడు.
తాను రికార్డుల కోసం పాకులాడే వ్యక్తినికానని, జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పిన యూనిస్.. హనీఫ్ మహమ్మద్ రికార్డును అందుకోలేనందుకు తానేమీ విచారపడటం లేదని అన్నాడు. అయితే భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా రికార్డును సాధిస్తానని యూనిస్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా (400 నాటౌట్) రికార్డును బద్ధలు కొడతాడనుకున్న కెప్టెన్ యూనిస్ ఖాన్ నిరాశపరిచాడు. వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరు 306కు మరో 7 పరుగులు జోడించిన యూనిస్ ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఎక్కువసేపు బ్యాటింగ్ (836 నిమిషాలు) చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, మహ్మద్ హనీఫ్ (970 నిమిషాలు), కిర్‌స్టన్ (878 నిమిషాలు)లు తొలి రెండు స్థానాలలో ఉన్నారు.