బ్యాటింగ్ వైఫల్యం వల్లనే అపజయం : ధోనీ

క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్‌లో... టీం ఇండియా 7 వికెట్ల తేడా పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాపోయాడు. జట్టు సభ్యులు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయకపోవడం వల్లనే అపజయం పాలయ్యామని ఆయన వ్యాఖ్యానించాడు.

ఈ విషయమై ధోనీ మాట్లాడుతూ... టీం ఇండియాలోని చాలామంది ఆటగాళ్లు మంచి ఆటతీరును కనబర్చినప్పటికీ, చిన్న చిన్న తప్పిదాలను చేయడంతో పెవిలియన్ చేరక తప్పలేదని ధోనీ వివరించాడు. లోపాలను గుర్తించి, సరిగా క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కివీస్ బౌలర్లు వమ్ము చేశారని అన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లుగానీ, ట్వంటీ20 మ్యాచ్‌లుగానీ 20 ఓవర్లే ఉండటంతో.. 200 పరుగుల కంటే మించి స్కోర్ చేయడం సాధ్యం కాదని ధోనీ చెప్పాడు. ఇలాంటి మ్యాచ్‌లలో 180 నుంచి 190 పరుగులు చేస్తేనే సంతోషం కలుగుతుంది. ఈ రోజు మ్యాచ్‌లో చేసిన తమ స్కోరుకు మరో 25 పరుగులు అదనంగా జోడించి ఉన్నట్లయితే కివీస్ బౌలర్లను ఇరకాటంలో పెట్టి ఉండేవారమని ధోనీ అన్నాడు.

ఇదిలా ఉంటే... ధోనీ ఆడిన 12 ట్వంటీ20 మ్యాచ్‌లలో మూడవ అపజయాన్ని ఎదుర్కోవడంతో, ఒకింత నిరుత్సాహానికి గురయ్యాడు. కివీస్ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టని కారణంగా.. టీం ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. కాగా, ఈ అపజయంతో పాఠాలు నేర్చుకుని మరింత ప్రణాళికతో కివీస్ బౌలింగ్‌ను ఎదుర్కొని విజయం సాధిస్తామని ధోనీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి