మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేయండి. అద్బుతాలు జరుగుతాయన్న మిథాలి

మంగళవారం, 25 జులై 2017 (06:19 IST)
మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొన్నారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో విజయానికి అతి చేరువలోకి వచ్చి పరాజయం పాలయిన ఘటనలు మరోసారి జరగకూడదంటే మహిళా ఐపీఎల్ ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమని మిథాలి అభిప్రాయ పడ్డారు.  ప్రపంచ కప్ ఫైనల్లో ఆట మొదలు కాకముందే జట్టులో ఒత్తిడి ఏర్పడిందని, అందుకే చివర్లో తడబడి ఆటను ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టుకు కోల్పోయామని చెప్పారు. బిగ్‌బాష్, ఐపీఎల్‌ తరహా లీగ్‌ల్లో ఆడితే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చంది. అంచనాలు లేని దశనుంచి ప్రపంచ కప్ ఫైనల్ వరకూ సాగిన టీమిండియా పరిణామ క్రమాన్ని మిథాలీ మాటల్లోనే విందాం. 
 
"ఓటమిని తప్పించుకోలేక పోయినప్పటికీ జట్టు ఆడిన తీరుపై  గర్వంగా ఉన్నానని, భారత వర్ధమాన మహిళా క్రికెటర్లకు వీరంతా మంచి వేదికను ఏర్పాటు చేసినట్టుగానే భావిస్తున్నానని మిథాలీ చెప్పింది. ప్రపంచ కప్‌లో అడటంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ద్వారాలు తెరిచినట్టయ్యింది. దీనికి ఎవరికి వారు గర్వపడాల్సిందే. ఫైనల్‌కు ముందు జట్టులోని ప్రతి ఒక్కరు నెర్వస్‌గా ఉన్నారు. ఇది మా ఓటమికి కారణమయ్యింది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అనుభవం వారికి లేదు. కానీ టోర్నీ అంతా వారు పోరాడిన తీరు మెచ్చుకోదగింది...
 
...జట్టులో నాణ్యమైన క్రికెటర్లున్నారు. భారత జట్టుకు మెరుగైన భవిష్యత్‌ ఉంది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తగ్గించుకుని ఆడితే సరిపోతుంది. 2005 ప్రపంచకప్‌ ఫైనల్లో మేం ఆసీస్‌ చేతిలో 98 పరుగుల తేడాతో ఓడాం. దాంతో పోలిస్తే ఇప్పటికి మేం చాలా మెరుగుపడినట్టే. ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్, పూనమ్‌ రౌత్‌ ఆడిన తీరు అద్భుతం. అయితే వారిద్దరి వికెట్లు పడిన తర్వాత పరిస్థితి మొత్తం తలకిందులైంది. లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌పై చాలాకాలంగా ఆందోళన ఉంది. వారి నుంచి కాస్త పరుగులు రావాల్సి ఉంది. టెయిలెండర్లకు బ్యాటింగ్‌ రావడం కూడా ముఖ్యమే.
 
...ప్రధాని, మాజీ క్రికెటర్లతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు స్పందించిన తీరు నిజంగా సంతోషాన్నిచ్చింది. కచ్చితంగా మమ్మల్ని చూసి బీసీసీఐ గర్విస్తుంది. లీగ్‌ దశలో వరుసగా దక్షిణాప్రికా, ఆసీస్‌ జట్ల చేతిలో ఓడిపోయాక మేము ఫైనల్‌కు వస్తామని ఎవరూ అనుకోలేదు. అయితే మేము కలిసికట్టుగా పోరాడి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాం."
 
స్మృతి, హర్మన్‌ప్రీత్‌లకు బిగ్‌బాష్‌ లీగ్‌ అనుభవం బాగా ఉపయోగపడింది. మాలో చాలామందికి అలాంటి లీగ్‌ల్లో ఆడగలిగితే ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో తడబడకుండా ఉండగలరు. నాకైతే మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి