తక్కువ పెట్టుబడి - అధిక లాభం పేరుతో ఆశ చూపి : నెల్లూరు మహిళ నుంచి రూ.2.46 కోట్లు స్వాహా!!

ఠాగూర్

ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (15:46 IST)
ఏపీలోని నెల్లూరుకు చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. తక్కువ పెట్టుబడి అధిక లాభం ఆశ చూసి నెల్లూరు మహిళకు వల వేసి రూ.2.45 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టారు. ఇన్‌‍స్టాగ్రామ్‍‌లో వచ్చిన ఓ లింకును నమ్మి మోసపోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
నెల్లూరు నగరంలోని పొగతోట ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించిన ఒక లింక్ కనిపించింది. దానిపై క్లిక్ చేయగా, నిషాబసు అనే మహిళ ఆమెను సంప్రదించింది. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని, తాను సూచనలు, సలహాలు అందిస్తామని నమ్మపలికింది. 
 
ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‍‌ను లలిత ఫోనులో ఇన్‌స్టాల్ చేయించింది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే లాభాలు రెట్టింపు అవుతాయని ఆశ చూపడంతో లలిత పలు దఫాలుగా అప్పులు చేసి డబ్బు జమ చేశారు. ఈ యేడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ మధ్య కాలంలో మొత్తం రూ.2,46,30,396 ఆ యాప్ ద్వారా డిపాజిట్ చేశారు. 
 
కొంతకాలం తర్వాత లలిత ఖాతాలో రూ.4,02,24,759 జమ అయినట్టు సైబర్ నేరగాళ్లు యాప్‌లో చూపించారు. అయితే, డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు లలిత ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు గత మార్చి 9వ తేదీన నెల్లూరు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సాంకేతిక ఆధారాలన విశ్లేషిస్తూ చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్‌లో విస్తృతంగా గాలించారు. 
 
ఈ మోసం వెనుక రాజస్థాన్‌కు చెందిన రామారామ్, అతని అనుచరులు గోగారామ్, హేమంత్ కుమార్, కైలాష్, నాగారంతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన వీరేశ్వర రావు, ఎం.రవి ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో వేగంగా స్పందించిన ఐదుగురు నిందితులు, హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు