మరో వివాహం చేసుకునేందుకు భార్యను హతమార్చిన భర్త.. ఎక్కడ?

ఠాగూర్

బుధవారం, 9 అక్టోబరు 2024 (14:07 IST)
మరో మహిళను వివాహం చేసుకునేందుకు ఇద్దరు పిల్లల తల్లి అయిన కట్టుకున్న భార్యను కట్టుకున్న భర్తే హత్య చేశాడు. మృతురాలు ఓ అంగన్వాడీ టీచర్ కావడం గమనార్హం. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతో భర్తే ఆమెను హత్య చేసి సాగర్ ఎడమ కాలువలోకి నెట్టేసి ప్రమాదంగా చిత్రీకరించినట్టు తేలింది. పోలీసుల కథన మేరకు..
 
నల్గొండ జిల్లా వేములపల్లికి చెందిన అనూష, సైదులు 16 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతకొంతకాలంగా అనూష వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం భర్తకు కలిగింది. దీంతో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అంగన్వాడీ కార్యకర్త అయిన అనూషకు ఇటీవల కామేపల్లికి బదిలీ అయింది. 
 
ఈ క్రమంలో శనివారం సాయంత్రం విధులు ముగిసిన అనంతరం అనూషను తీసుకుని కామేపల్లి నుంచి వేములపల్లికి బైక్‌పై బయల్దేరాడు సైదులు. మార్గమధ్యలో అనూషను సాగర్‌ ఎడమకాలువలోకి నెట్టేశాడు. బైక్‌తో పాటు కాలువలో పడిపోయామని.. తన భార్య గల్లంతైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
 
పోలీసుల విచారణలో సైదులును విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కుట్ర బయటపడింది. అనూష అడ్డు తొలగించుకొని మరో వివాహం చేసుకునేందుకు భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది. నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు