ఎయిర్ ఇండియా కూడా ప్రైవేటుపరం... ఇక మిగిలింది రైల్వే ఒక్కటే...

శనివారం, 27 మార్చి 2021 (20:27 IST)
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. దేశంలోని అన్ని పబ్లిక్ రంగాలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేసింది. ఫలితంగా పలు బ్యాంకులు కనుమరుగైపోయాయి. మరో ఏడు బ్యాంకులను కూడా లేకుండా చేయాలని ప్లాన్ చేసింది. 
 
అలాగే, విశాఖ ఉక్కు పరిశ్రను పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని పోర్టుల్లో ఒక్కోదాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. అలాగే, దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టింది. ఇపుడు ఎయిర్ ఇండియా వంతు వచ్చింది. ఇందులో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. 
 
ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది ఇక్కడ ముఖ్యంకాదన్నారు. పెట్టుబడులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలా లేక సంస్థను మూసివేయాలా అన్నది ప్రస్తుతం తమ వద్ద ఉన్న మార్గమన్నారు. ఆస్తులపరంగా ఎయిర్‌ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ సంస్థకు 60 వేల కోట్ల అప్పులు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ రుణ భారాన్ని తప్పించడమే తమ కర్తవ్యమన్నారు.
 
64 రోజులలోపు బిడ్లు దాఖలు చేయాలని షార్ట్ లిస్ట్ చేసిన బిడ్డర్లకు తెలియజేయాలని హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఈసారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నదని, పెట్టుబడుల ఉపసంహరణలో ఎలాంటి సంకోచంగానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ఇదిలావుంటే, రైల్వేలో కూడా ప్రైవేటు రైళ్లకు అనుమతులు ఇచ్చారు. దీంతో త్వరలోనే ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రైవేటుపరం చేయని సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క రైల్వే మాత్రమే. చివరకు జీవిత బీమా సంస్థలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెల్సిందే. 
 
దీంతో దేశంలోని అన్ని పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా ప్రధాని మోడీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతోంది. ఇది చివరకు ఎక్కడకు దారితీస్తుందోనన్న భయం దేశ ప్రజల్లో నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు