దేశ వ్యాప్తంగా వాహనాల ధరలు తగ్గాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కార్లు, ద్విచక్రవాహనాల ధరలతో పాటు ఏకంగా 375 రకాలైన వస్తువుల ధరలు తగ్గాయి. కొత్త పన్ను విధానం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. దీంతో వాహన రంగంలో అతిపెద్ద ధరల తగ్గింపు నమోదవుతుంది.
350 సీసీ లోపు బైకులపై భారీ ఊరట లభించింది. దేశంలో దాదాపు 98 శాతం మార్కెట్ వాటా కలిగిన 350 సీసీ లోపు స్కూటర్లు, మోటార్ సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో హీరో స్పెండర్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి అత్యంత ప్రజాధారణ కలిగిన మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. హోండా తన యాక్టివాపై సుమారు రూ.7874, సీసీ 350 బైకుపై రూ.18887 వరకు తగ్గించింది. అలాగే, మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకీ వంటి కార్ల ధరలు రూ.లక్షల్లో తగ్గడం గమనార్హం.