కోవిడ్‌ 19 కారణంగా చికిత్స సవాళ్లను ఎదుర్కొంటున్న హెమోఫిలియా రోగులు

సోమవారం, 19 అక్టోబరు 2020 (19:23 IST)
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం బారిన పడని దేశమేదీ లేదు. భారతదేశమూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వనరులు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కోవిడ్‌-19 రోగుల నిర్వహణ కోసమే తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఈ కారణం చేతనే కోవిడేతర రోగులైన హెమోఫిలియా రోగుల చికిత్సలో అవరోధాలు ఏర్పడ్డాయి. రోగులలో ఈ వ్యాధి పట్ల అవగాహన తక్కువగా ఉండటం, నిపుణుల కొరత వంటివి హెమోఫిలియా రోగులకు మరింత కష్టంగా మారుతుంది.
 
హెమోఫిలియా రోగులు ఇప్పుడు పూర్తి భయాందోళనల్లో కూరుకుపోయారు. ఆస్పత్రికి వెళ్తే కరోనా వ్యాధి తమకు ఎక్కడ సోకుతుందోననే భయం వారిని వెంటాడుతుంది. ఆస్పత్రిలో అవసరమైన చికిత్స సదుపాయాలు ఉన్నప్పటికీ, కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా ఆస్పత్రులకు వెళ్లడానికి రోగులు భయపడుతున్నారు. హెమోఫిలియా రోగులు సాధారణ జీవితం గడపాలంటే ముందుగా రోగ నిర్థారణ జరగడం, చికిత్సనందించడం, ఫిజియోథెరఫీ అనేవి అత్యంత కీలకం.
 
డాక్టర్‌ రాధిక కనకరత్న, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- పాథాలజిస్ట్‌, నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌, హైదరాబాద్‌ మాట్లాడుతూ, ‘‘హెమోఫిలిక్‌ వ్యాధితో బాధపడుతున్న రోగుల నిర్వహణలో గణనీయమైన మార్పులను ప్రస్తుత మహమ్మారి తీసుకువచ్చింది. ఆస్పత్రిని సందర్శించే హెమోఫిలిక్‌ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం 5-6 రోగులు మాత్రమే నెలలో వస్తున్నారు. డయాగ్నోసిస్‌ కేంద్రం పనిచేస్తుంది కానీ రొటీన్‌ ప్రొఫిలాక్సిస్‌ తాత్కాలికంగా పనిచేయడం లేదు. సాధారణ ప్రజల్లాగానే హెమోఫిలిక్స్‌ కూడా కోవిడ్-19 ప్రమాద బారిన పడేందుకు అవకాశాలున్నాయి. అందువల్ల రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
 
ఫ్యాక్టర్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్స మరియు ఫిజియోథెరఫీ అందుబాటులో ఉండటం చేత, హెమోఫిలియా రోగులు మరీ ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడగలుగుతున్నారు. అవగాహన లేమి, చికిత్సను సరైన సమయంలో అందించకపోవడం వల్ల మరణాలూ అధికంగా సంభవిస్తున్నాయి.
హెమోఫిలియా అంటే ఏమిటి ?
వంశపారంపర్య జన్యు లోపం కారణంగా వచ్చే వ్యాధి హెమోఫిలియా. రక్తాన్ని గడ్డకట్టించే లక్షణంపై నియంత్రణను శరీరం కోల్పోతుంది. అధికంగా రక్తస్రావం కావడం వల్ల మరణించేందుకు అవకాశాలు అధికంగా ఈ వ్యాధిలో ఉంటాయి. హెమోఫిలియా సాధారణంగా హెమోఫిలియా ఏ మరియు హెమోఫిలియా బీ అని రెండు రకాలుగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు