పురుషుల్లో ఆ సమస్య.. ప్రతి పది మందిలో ఒకరు అలాంటి..?

మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:28 IST)
ఆధునిక పోకడలు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, పౌష్టికాహారం లోపం వంటి పలు కారణాల రీత్యా పురుషుల్లో సంతాన సాఫల్యత క్రమేణా తగ్గిపోతుంది. పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి పది మంది పురుషుల్లో ఒకరు తండ్రి అయ్యేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 
 
తక్కువ వీర్యకణాల సంఖ్యతో పెద్దసంఖ్యలో పురుషులు సంతాన లేమితో సతమతమవుతున్నారని ఆ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ఈ లక్షణం కారణంగా పురుషుల్లో తర్వాతి దశల్లో క్యాన్సర్‌ రిస్క్‌కూ దారితీస్తుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు. 
 
ఇందుకు కారణంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసాహారం తీసుకోవడం, కూల్‌డ్రింక్స్ తాగడం వంటివేనని పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకునే పురుషుల్లో సగటు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలింది. సహజంగా సంతానోత్పత్తికి వీర్యకణాల సంఖ్య 39 మిలియన్లు ఉండాలని వారు తెలిపారు. మరోవైపు చాలామంది పురుషులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఈ లోపంతో పుడుతున్నారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
 
తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుగా వున్నప్పుడే పునరుత్పత్తి అవయవాలు ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయనేందుకు ఆధారాలున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇది వీర్యకణాలు తగ్గడానికే పరిమితం కాదని, వారు వయసు పెరిగేకొద్దీ హృద్రోగాలు, క్యాన్సర్‌ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు