అంజీర పండులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి శరీరానికి క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు అవసరం. అంజీర పండులో ఇవి సమృద్ధిగా ఉంటాయి. అంజీర పండ్లలోని క్యారటోన్లు, ల్యూటిన్, టాన్నిస్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు, కరిగిపోయే పీచు పదార్థం ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలో ఎ, ఇ, కే విటమిన్లు తగినంత స్థాయిలో ఉంటాయి ఈ పండ్లలో కేలరీలు కూడా చాలా తక్కువే. అంటే దాదాపు 100 గ్రాముల పండ్లలో 74 కేలరీలే ఉంటాయి.
ఎప్పుడూ ఆకలితో ఉంటూ, కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆబగా తినేస్తూ కొందరు ఊబకాయాన్ని తెచ్చుకుంటారు. అలాంటి వారు అంజీర పండ్లను తింటే, వాటిలోని పీచుపదార్థం, క్యాల్షియం, ఐరన్ ఆకలిని తగ్గించడం ద్వారా క్రమంగా బరువును తగ్గిస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వు తక్కువగానూ, నీరు ఎక్కువగానూ ఉంటాయి. ఇది కూడా బరువు నియంత్రణలో ఉండడానికి తోడ్పడుతుంది.
అంజీర ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకు తోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.