పాండవులకు, కౌరవులకు మధ్య మహాసంగ్రామం జరిగిన ''కురుక్షేత్రం'' గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కురుక్షేత్రం అనే పేరు.. ఎలా వచ్చిందంటే.. కురువంశ మూలపురుషుడైన కురువు పేరు మీద ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందంటారు. కురుక్షేత్రం కంటే ముందు ఈ ప్రాంతాన్ని ''బ్రహ్మవర్త'' అని పిలిచేవారట. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి.
ఇకపోతే.. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఓ ప్రముఖ ఘట్టంగా మిగిలిపోయింది. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది ఈ ప్రాంతంలోనే. శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనాన్ని ఇదే ప్రాంతంలోనే అర్జునునికి కల్పించాడు.