యావదాస్తి దానం చేస్తానంటున్న బిల్ గేట్స్ - అద్భుతమైన నిర్ణయమంటూ మెలిండా గేట్స్!!

ఠాగూర్

సోమవారం, 12 మే 2025 (16:30 IST)
ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ విషయంలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2045 నాటికి ఫౌండేషన్ వద్ద ఉన్న సుమారు 200 బిలియన్ డాలర్ల భారీ నిధిని పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆ సంస్థను శాశ్వతంగా మూసి వేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై పలువురు కుబేరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ మాత్రం స్వాగతించారు. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. ఈ ఆలోచనకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ఆంగ్ర పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెలిండా గేట్స్ మాట్లాడుతూ, రాబోయే రెండు దశాబ్దాల్లో ఫౌండేషన్ తన వార్షిక వ్యయాన్ని రెట్టింపు చేసి, ఈ నిధులను ప్రాణాంతక వ్యాధుల నిర్మూలన, మాతాశిశు మరణాల తగ్గింపు, ప్రపంచవ్యాప్త పేదరిక నిర్మూలనకు ఖర్చు చేస్తుందన్నారు. 'ఈ భారీ వనరులు తిరిగి సమాజానికే చెందాలన్నది ఫౌండేషన్ అసలు ఉద్దేశం' అని ఆమె స్పష్టం చేశారు.
 
గత యేడాది ఫౌండేషన్ నుంచి వైదొలగి, 'పివోటల్ వెంచర్స్' అనే సొంత సంస్థ ద్వారా మహిళా సాధికారతపై దృష్టి సారించిన మెలిండా, ఫౌండేషన్ నిధులను పూర్తిగా ఖర్చు చేయాలన్నది తమ ఉమ్మడి ఆలోచనే అయినా, కాలపరిమితిపై తుది నిర్ణయం బిల్ గేట్స్ దేనని తెలిపారు. బిలియనీర్లు తాము ఆర్జించిన సంపదలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఉందని ఆమె నొక్కిచెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు