ఇరాన్ నుంచి మిడతలు వచ్చేస్తున్నాయ్.. కేంద్రానికి మరో తలనొప్పి

బుధవారం, 1 జులై 2020 (16:27 IST)
మిడతలతో తలనొప్పి తప్పేలా లేదు. కరోనా ఓవైపు వేధిస్తుంటే.. మరోవైపు మిడతలు దేశంలోని 101 జిల్లాలకు వ్యాపించాయి. తొమ్మిది రాష్ట్రాల రైతులు మిడతల దాడిలో తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా కీటక నాశకాలను పిచికారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయత్నం ఎంత విజయవంతమవుతుందో తేలాల్సి ఉంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మరో గండం ఇరాన్‌లో సమాయత్తమవుతోంది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో మరో మిడతల గుంపు తయారు అయ్యిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) నివేదిక పేర్కొంది. ఇది రాబోయే నెలల్లో మరోసారి భారతదేశానికి వలస వెళ్లి మళ్ళీ పంటల నాశనానికి దారి తీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మిడతలను నియంత్రించేందుకు హెచ్‌ఐఎల్ ఇండియా లిమిటెడ్ 25 మెట్రిక్ టన్నుల మలాథియాన్ (95% యుఎల్‌వి) ఇరాన్‌కు పంపింది.
 
ఇదిలా ఉంటే 2,33,487 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలన్నీ మిడతల దాడికి గురయ్యాయని ఇప్పటికే కేంద్రం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని 40 జిల్లాలు, రాజస్థాన్‌లో 31 జిల్లాలు, యూపీలోని 13 జిల్లాలు మిడతల కారణంగా దాడికి గురయ్యాయి. ఇంకా హర్యానా, బీహార్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌లలో కూడా మిడతల ప్రభావం భారీగా ఉంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు