ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనంటూ భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా కాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించింది. దీంతో భారత్ ఘాటుగా ప్రతిస్పందించింది. పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతమంతా భారత్‌లో అంతర్భాగమని, దాన్ని తక్షణం ఖాళీ చేయాలని హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది.
శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ అనవసర అంశాలను లేవనెత్తుతోందని మండిపడ్డారు. కాశ్మీర్‌పై మరోమారు అనవసర వ్యాఖ్యలు చేశారని అన్నారు.
పదేపదే ఈ అంశాన్ని లేననెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవన్నారు. ఇలాంటి ప్రయత్నాలతో సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరన్నారు. కాశ్మీర్‌లోని కొంతప్రాంతం ఇప్పటివరకు పాక్ ఆక్రమణలోనే ఉందని, దాన్ని పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.