అప్పటి వరకు మాల్యాను అప్పగించం: బ్రిటన్

సోమవారం, 18 జనవరి 2021 (20:52 IST)
వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన రహస్య లీగల్‌ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆయనను భారత్‌కు అప్పగించేది లేదని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసిందని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

బ్రిటన్‌ ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారంలోని ముఖ్య భాగాలను పేర్కొంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు రాసిన లేఖను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టులో చదివి వినిపించారు. మాల్యాను అప్పగించడానికి ముందుగా పరిష్కరించాల్సిన మరో లీగల్‌ సమస్య వుందని బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొందని ఆ లేఖ తెలిపింది.

అయితే ఆ సమస్య ఏంటనే వివరాలు వెల్లడించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరించింది. న్యాయ పరిధిలో వున్న అంశమని మాత్రమే పేర్కొంది. దీన్ని పరిష్కరించడానికి ఎంత కాలం పడుతుందనే అంశాన్ని కూడా చెప్పలేదు. అయితే మాల్యా కేసు భారత్‌కు ఎంత కీలకమైనదో తమకు తెలుసునని వ్యాఖ్యానించింది.

సాధ్యమైనంత త్వరలో విషయాన్ని పరిష్కరించడానికే చూస్తామని బ్రిటన్‌ హామీ ఇచ్చినట్లు ఆ లేఖ పేర్కొంది. మాల్యాను భారత్‌కు రప్పించడానికి భారత్‌ చాలా తీవ్రంగా కృషి చేస్తోందని మెహతా కోర్టుకు తెలిపారు.

దీనిపై తదుపరి విచారణను మార్చ 15కి వాయిదా వేశారు. బ్రిటన్‌లో మాల్యా కేసు ముగిసినా ఇంకా కొన్ని ప్రొసీడింగ్స్‌ ఆయనపై వున్నాయని అవి రహస్యమైనవని బ్రిటన్‌ పేర్కొంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు