కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఖాళీ అవుతున్న ఉత్తర కొరియా

బుధవారం, 4 అక్టోబరు 2017 (06:13 IST)
ఉత్తర కొరియా ఖాళీ అవుతోంది. ఈ దేశంపై అమెరికా ఏ క్షణమైనా దాడులతో విరుచుకుపడే అవకాశం ఉండటంతో ఉత్తర కొరియా వాసులు ప్రాణభయంతో ఆ దేశాన్ని వీడుతున్నారు. ఇప్పటికే రెండు లక్షల మంది వరకు ఉ.కొరియాను వీడినట్టు సమాచారం. 
 
నిజానికి ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి ఉత్తరకొరియా, అమెరికాలపైనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే వాటికి కారణమైందని అంతర్జాతీయ మీడియా ఆరోపించింది. ఎంతో మంది ఉత్తరకొరియా పౌరులు దేశం విడిచి పారిపోతున్నారని తెలిపింది. 
 
కేవలం చైనాలోనే 2 లక్షల మంది ఉత్తరకొరియా పౌరులు అక్రమంగా నివసిస్తున్నారని చెబుతోంది. ఉత్తరకొరియాలో పని లేకపోవడం వల్లే ఆర్థిక బాధలు తట్టుకోలేక చాలామంది వలసవెళ్తున్నారని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది.
 
దానికితోడు ఇటీవల ఐక్యరాజ్యసమితి విధించిన అంక్షల నేపథ్యంలో పని లేక కార్మికులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటోంది. దేశాధ్యక్షుడు కిమ్ ఆ పరిస్థితులను చక్కదిద్దలేకపోతున్నారని ఆరోపించింది. 
 
ప్రజలు తమ భవిష్యత్తుపై బెంగతోనే ముందుగానే దేశం విడిచి వెళ్తున్నారని తెలిపింది. ముఖ్యంగా వారు వలస వెళ్తున్న దేశాల్లో చైనానే ముందు వరుసలో ఉందని తెలిపింది. తర్వాత స్థానంలో బ్రిటన్ ఉందని అంతర్జాతీయ మీడియా చెపుతోంది. 
 
కాగా, ఇటీవలికాలంలో వరుస క్షిపణి పరీక్షలతో పాటు అణు బాంబు పరీక్షను నిర్వహించిన ఉత్తర కొరియా, అగ్రరాజ్యం అమెరికా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో అమెరికా ఏ క్షణమైనా దాడి చేసే సన్నాహాల్లో నిమగ్నమైవుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు