భారత్ - పాక్‌తో సహా మొత్తం ఏడు యుద్ధాలు ఆపాను.. శాంతి బహుమతి ఇవ్వాలి : డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్

బుధవారం, 24 సెప్టెంబరు 2025 (10:20 IST)
భారత్ - పాకిస్థాన్ సహా మొత్తం ఏడు యుద్ధాలు ఆపానని, అందువల్ల నోబెల్ శాంతి బహుమతిని తనకే ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు డిమాండ్ చేశారు. 150 దేశాల నేతలు హాజరైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి పనితీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఐరాసవి ఉత్తుత్తి మాటలేనని, చేతల్లేవని ధ్వజమెత్తారు. 
 
దీంతోపాటు భారత్ - పాక్ యుద్ధంపైనా మళ్లీ ఆయన పాత పాటే పాడారు. యుద్ధాన్ని తానే ఆపానని చెప్పారు. అంతేకాదు ఏకంగా 7 యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. మంగళవారం న్యూయార్క్ ప్రారంభమైన ఐరాస సభ 80వ సెషన్‌లో ట్రంప్ 56 నిమిషాలపాటు ప్రసంగించారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఐరాస వేదికగా ప్రపంచ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ఇదే ప్రథమం. 
 
అంతేకాదు.. ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ ఐరాసలో ఇంతసేపు ప్రసంగించలేదు. 'ఐరాసకు గొప్ప సామర్థ్యముందని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా. కానీ అది కనీసం దానికి దగ్గరికి చేరుకోవడానికీ ప్రయత్నించదు. ఇప్పటికైనా అది బలమైన పదాలతో లేఖ రాయడానికిగానీ, దానిని పాటించడానికిగానీ ముందుకు రాదు. అది ఉత్త పదాలనే రాస్తుంది. అవి యుద్ధాలను పరిష్కరించలేవు' అని ట్రంప్ విమర్శించారు. 
 
'కేవలం 7 నెలల వ్యవధిలోనే ఎప్పటికీ ముగియని యుద్ధాలను ముగించా. అందులో కొన్ని 31 ఏళ్ల నుంచి కొనసాగుతున్నవీ ఉన్నాయి. ఇంకా 36 ఏళ్ల నుంచీ, 28 ఏళ్ల నుంచీ కొనసాగుతున్న యుద్ధాలను ఆపా' అని ట్రంప్ పేర్కొన్నారు. 'ఏడు యుద్ధాలను ఆపా. వీటిలో ఇప్పటిదాకా వేల మంది మరణించారు. కంబోడియా - థాయ్లాండ్, కొసావో - సెర్బియా, కాంగో - రువాండా, భారత్ - పాకిస్థాన్, ఇజ్రాయెల్ - ఇరాన్, ఈజిప్టు - ఇథియోపియా, ఆర్మేనియా - అజర్‌బైజాన్‌ల మధ్య యుద్ధాలను ఆపేశా' అని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు