పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసిన కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు బెల్జియం పోలీసులు శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏడేళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న చోక్సీని అరెస్టు చేయడం ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగుగా అధికారులు పరిగణిస్తున్నారు.
భారత దర్యాప్తు సంస్థలు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అభ్యర్థన మేరకు బెల్జియం అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు సమయంలో 65 యేళ్ల చోక్సీ బెల్జియంలోని ఒక ఆస్పత్రిలో బ్లడ్ కేన్సర్‌కు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మెరుగైన వైద్యం కోసం స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.