ప్రపంచ విషాదాల్లోనే అమెరికాపై దాడి సంఘటన అతి పెద్దదిగా నిలిచిపోయింది. 2001, సెప్టెంబర్ 11న.. సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావత్తూ అమెరికా దద్దరిల్లింది. శత్రు దుర్బేధ్యం అంటూ మురిసిపోయే అగ్రరాజ్యం అభిజాత్యంపై భయంకరమైన దెబ్బ పడింది.
అమెరికా పాలకులు, ప్రజలకు వెన్నులో వణుకుపుట్టించేలా ఉగ్రవాదులు పంజా విసిరారు. కనీవినీ ఎరుగని రీతిలో విమానాలతో స్వైర విహారం చేశారు. డబ్ల్యూ టీసీ జంట భవనాలతో పాటు ఏకంగా పెంటగాన్ రక్షణ కార్యాలయంపైనే దాడి చేసి దిగ్భ్రాంతికి గురి చేశారు.
మంటలను ఆర్పేయడానికి అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా పనిచేశారు. ఈ ఘటన జరిగి 18 ఏళ్లు. డబ్ల్యూ టీసీ దాడులపై అమెరికా ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాల పౌరులే దాడులకు పాల్పడినట్లు గుర్తించారు.
అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, అల్‌ఖైదా సీనియర్ నాయకులు ఖలీద్ షేక్ మహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచీ, ముస్తఫా అల్ హౌసవీల ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయని కనిపెట్టారు. 2002-2003 మధ్య ఖలీద్ షేక్ మహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచీ, ముస్తఫా అల్ హౌసవీలను అరెస్టు చేశారు.