భారత్‌లో ఆహారాన్ని వృధా చేసే వారి సంఖ్య ఎంతో తెలుసా?

శనివారం, 6 మార్చి 2021 (16:11 IST)
భారత్‌లో ఆహారాన్ని వృధాచేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి భారతీయుడు ఏడాదికి 50 కిలోల తిండిని వృథా చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా తలసరి ఫుడ్‌ వేస్టేజీ 121 కేజీలుగా ఉంది. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌ఈపీ) విడుదల చేసిన 'ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌ 2021'లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలను పొందుపరిచారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా తలసరి ఫుడ్‌ వస్టేజీ ఏడాదికి 121 కిలో గ్రాములుగా ఉంది. ఇందులో ఇళ్ళల్లో 74 కేజీలుగా, ఫుడ్‌ సర్వీసుల్లో 32 కేజీలుగా, రిటైల్‌లో 15 కేజీలుగా ఉన్నది. ఇండ్లల్లోనే ఆహారం వృథా అవుతున్నది. 61శాతం ఇక్కడే జరుగుతుంది. 
 
ఇక 26 శాతం ఫుడ్‌ సర్వీసులో, 13 శాతం రిటైల్‌లో అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్‌ టన్నుల ఆహారం అందుబాటులో ఉంటే.. ఇందులో 931 మిలియన్‌ టన్నుల ఆహారం (17శాతం) ఇండ్లు, రిటైలర్స్‌, ఫుడ్‌ సర్వీసులు, ఇతర మార్గాల ద్వారా వృథాగా పోవడం గమనార్హం.
 
2019-20లో భారత్‌ ఉత్పత్తి చేసిన ఆహార ధాన్యాలు, నూనెగింజలు, చెరుకు, ఉద్యానవన ఉత్పత్తులతో దాదాపు సమానం. యూఎన్‌కు చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏక్యూ) అంచనా వేసిన సమాచారం ప్రకారం.. 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 690 మిలియన్ల మంది ప్రజలు ఆకలి కష్టాన్ని చూశారు. అయితే, కోవిడ్‌-19 ప్రభావంతో ఈ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉండొచ్చని 'ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌' అంచనా వేసింది.
 
కాగా, 'ఆహార వృథా' అంశం ప్రభుత్వాలకు, అంతర్జాతీయ సంస్థలకు, వ్యాపార సంస్థలకు, ఫిలాంత్రోపిక్‌ ఫౌండేషన్స్‌కు తప్పక ప్రాధాన్యం కావాలనీ, 2030 వరకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుందని యూకే కేంద్రంగా పనిచేసే ఎన్జీవో డబ్ల్యూఆర్‌ఏపీ సీఈఓ మార్కస్‌ గోవర్‌ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు