క్వాడ్ కూటమిలోని దేశాధ్యక్షుల సమావేశం ముగిసిన కొన్ని రోజుల్లోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా రక్షణశాఖ మంత్రి (డిఫెన్స్ సెక్రటరీ) లాయిడ్ ఆస్టిన్ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆయన తన పర్యటనను హవాయి నుంచి ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యో, సియోల్‌తో పాటు న్యూఢిల్లీలో కూడా పర్యటించనున్నారు.
'ఈ పర్యటన మిత్రదేశాలు, భాగస్వాముల కోసం. మా సామార్థ్యాలు పెంచుకోవడంపై చర్చిస్తాం. మేము పోటీపడే శక్తి తగ్గింది. కానీ, భవిష్యత్తులో మా పోటీతత్వాన్ని కొనసాగిస్తాం. అంతేకాదు వృద్ధి చేసుకుంటాం కూడా. మా దగ్గర ఆ సామర్థ్యాలు, ప్రణాళికలు ఉన్నాయి. చైనాతో సహా మాకు సవాలు చేసే ఎవరికైనా తగిన సమాధానం ఇవ్వగలమని నిరూపిస్తాం' అని లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.