ఫస్ట్ ట్వంటీ20 : భారత్ స్కోరు 124/7 :: ఇంగ్లండ్ టార్గెట్ 125 రన్స్
శుక్రవారం, 12 మార్చి 2021 (20:48 IST)
స్వదేశంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్వంటీ20 సిరీస్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)లు ఇటొచ్చి అటెళ్లిపోయారు. ఫలితంగా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఆ తర్వాత రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే, జట్టు స్కోరు 48 పరుగుల వద్ద ఉండగా, రిషబ్ పంత్ (21) స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా 19 పరుగుల వద్ద ఔట్ కాగా, శార్దూల్ ఠాగూర్ డకౌట్ అయ్యాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ మాత్రం రాణించి 48 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 67 పరుగులు చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్ 7 చొప్పున పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 124 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముంగిట 125 రన్స్ విజయలక్ష్యంగా నిర్ధేశించింది.
ఇదిలావుంటే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు మోతేరా స్టేడియం వేదికగా నిలుస్తోంది. అయితే, గుజరాత్‍లో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ భారీ స్టేడియంలో 50 శాతం ప్రేక్షకులనే అనుమతించాలని సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్న గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. మార్చి 12న ప్రారంభమైన ఈ టీ20 సిరీస్ ఈ నెల 20వ తేదీతో ముగుస్తుంది.
దీనిపై గుజరాత్ క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు ధన్ రాజ్ నత్వాని స్పందిస్తూ... స్టేడియం సామర్థ్యంలో సగం మాత్రమే నిండేలా టికెట్ల అమ్మకం చేపడుతున్నట్టు తెలిపారు. టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.