కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

ఠాగూర్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (09:51 IST)
గగనతలంలో వెళుతున్న ఓ విమానాన్ని ఒక దండగుడు హైజాక్ (Man Attempts To Hijack Plane) చేసేందుకు ప్రయత్నించాడు. విమాన సిబ్బందికి కత్తి చూపి వారిని బెదిరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాలని ప్లాన్ చేశాడు. కానీ, అతని ప్లాన్ వికటించింది. ప్రయాణికుల్లో ఒకరు తన వద్ద ఉన్న తుపాకీతో ఆ దుండగుడుపై కాల్పులు జరిపాడు. దీంతో దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఈ సంఘటన జరిగింది. కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు ఓ చిన్నపాటి విమానం బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కత్తితో బెదిరిస్తూ హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. విమానాన్ని దేశం వెలుపలికి తీసుకెళ్లాలంటూ డిమాండ్ చేశాడు. కొంత మంది ప్రయాణికులను కూడా గాయపరిచాడు. 
 
ఆ సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దుండగుడు చర్యతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు దుండగుడుని నిలువరించే ప్రయత్నంలో తన వద్ద లైసెన్స్ గన్‌తో కాల్పులు జరపడంతో దుండగుడు ప్రాణాలు కోల్పోయినట్టు బెలీజ్ అధికారులు వెల్లడించారు. 
 
హైజాక్‌కు యత్నించిన దండుగుడుని అమెరికాకు చెందిన అకిన్యేనా సావా టేలర్‌గా గుర్తించారు. ఈ దండగుడు విమానంలోకి కత్తిని ఎలా తీసుకొచ్చాడా అన్న అంశంపై బెలీజ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. టేలర్‌పై కాల్పులు జరిపిన ప్రయాణికుడుని హీరోగా అభివర్ణించారు. దుండగుడు చేసిన పనికి ఆ విమానం రెండు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి, ఆ తర్వాత సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు