ఫేస్‌బుక్‌పై విమర్శలు.. ఫేస్‌బుక్‌లో ఇదే నా ఆఖరి రోజు.. యువ ఇంజనీర్

గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:34 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌కు ఈ సంస్థ ఇంజినీర్ ఒకరు రాజీనామా చేశారు. విద్వేషం నుంచి లాభాలు పొందుతోందని.. ఫేస్‌బుక్ సరైన మార్గంలో నడవడం లేదంటూ యువ ఇంజినీర్ అశోక్ చంద్వాని (28) ఈ సంస్థకు గుడ్‌బై చెప్పారు.

ఐదున్నరేళ్ల ప్రయాణం తర్వాత ఫేస్‌బుక్‌లో ఇదే తన ఆఖరి రోజు అని పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్వేష భావన నుంచి లాభం పొందాలనుకుంటున్న సంస్థలో పనిచేయడం ఇష్టం లేదని చెప్పారు.
 
విద్వేష పూరిత, అసత్య సమాచార ప్రచారాన్ని నియంత్రించాల్సిందిగా హక్కుల ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు కోరినా ఫేస్‌బుక్ తగిన చర్యలు తీసుకోవడం లేదని అశోక్ అభిప్రాయపడ్డారు. దీనిపై సంస్థ ప్రతినిధి లిజ్ బర్గేయస్ స్పందించారు. ఫేస్‌బుక్ ఎప్పుడూ విద్వేషం వల్ల లాభం పొందలేదని.. పైగా సామాజిక భద్రత కోసం మిలియన్ల డాలర్లు వెచ్చించినట్టు ఆమె తెలిపారు. 
 
నిపుణుల సూచనల మేరకు రాజకీయాలు, తదితర అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నామని వివరించారు. ఎలాంటి ఫిర్యాదులు అందనప్పటికీ మిలియన్ల కొద్దీ విద్వేష పూరిత పోస్టులను తొలగించామని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఫేస్‌బుక్‌కు సంబంధించి వాల్‌స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించించిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు