డిగ్గీ రాజా... అలియాస్ దిగ్విజయ్ సింగ్. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితం. ఈయన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో డిగ్గీరాజా ఒకరు. ఈయన ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
అయితే ఇపుడు ఈ డిగ్గీ రాజా విజయాన్ని కాంక్షిస్తూ కంప్యూటర్ బాబాగా పేరొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి పూజలు నిర్వహించారు. వందలాది సన్యాసులతో భోపాల్‌లోని సైఫియా కాలేజ్ మైదానంలో ఆయన ఈ పూజలు జరిపారు. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో రామమందిరం నిర్మించలేదని, మందిర్ లేకుండా నరేంద్ర మోడీ కూడా ఉండటానికి వీల్లేదని కంప్యూటర్ బాబా మండిపడ్డారు.
బీజేపీకి చెందిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. డిగ్గీ రాజా విజయాన్ని కాంక్షిస్తూ మూడు రోజుల పాటు ఏడు వేల మంది వరకూ సాధువులు పూజలు చేశారు. దిగ్విజయ్ సింగ్‌కు ఓటు వేయాలని కోరుతూ వందల మంది సన్యాసులు భోపాల్‌లో ఆటపాటలతో ప్రజలను కోరతారని కంప్యూటర్ బాబాగా పేరొందిన నామ్‌దేవ్ దాస్ త్యాగి చెప్పారు.