తమిళనాడు రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలతా విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే తరపున వీరి కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. అలాగే, భారతీయ జనతా పార్టీ తరపున సినీయర్ నటి రాధికా శరత్ కుమార్ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో ఆసక్తికరక పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు సమఉజ్జీలు కావడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
2006లో రాధిక రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్ కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే యేడాది ఆ పార్టీ నుంచి వారిని బహిష్కరించారు. 2007లో వారు అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చిని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో రాధిక శరత్ కుమార్ ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం ఈ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. బీజేపీ అధిష్టానం ఇపుడు రాధిక శరత్ కుమార్‌కు విరుదునగర్ స్థానాన్ని కేటాయించింది. దీంతో విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్, రాధిక శరత్ కుమార్‌ల మధ్య కీలక పోటీ జరుగనుంది. కాగా, గత యేడాది డిసెంబరు నెలలో విజయకాంత్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.