ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో చిక్కుకున్న పర్వతారోహులు...

మంగళవారం, 4 అక్టోబరు 2022 (17:16 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయా పర్వతంలో హిమపాతంలో దాదాపు 29 మంది పర్వతారోహులు చిక్కుకునిపోయారు. వీరంతా ట్రైనీ పర్వతారోహులు కావడం గమనార్హం. హిమాలయా పర్వతాల్లోని 'ద్రౌపది దండా-2' శిఖరాగ్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ట్రైనీ పర్వతారోహులు ప్రమాదంలో చిక్కున్న విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాధితులంతా ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు సీఎం వెల్లడించారు. 
 
ఇప్పటివరకు తొమ్మిది మందిని కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు, 16 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 'ద్రౌపది దండా - 2' శిఖరాగ్రంలో హిమపాతం కారణంగా పర్వతారోహకులు చిక్కుకుపోయారు. 
 
జిల్లా యంత్రాంగం, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఐటీబీపీల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని సీఎం ధామీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు సైన్యం సాయం కోరినట్లు తెలిపారు. ఈ విషయమై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సాధ్యమైన ప్రతి సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు