మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆస్పత్రిలోని రోగులను అతికష్టంమ్మీద ఖాళీ చేయించారు. ఈ ప్రమాదం జబల్‌పూర్‌లోని గొహల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దామోహ్ నాకా ప్రాంతంలోని న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగింది.
సోమవారం సాయంత్రం జరిగిన ఈ అగ్నిప్రమాదంపై జిల్లా సిద్ధార్థ్ బహుగుణ మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు, సహాయక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు మృతిచెందిన ఎనిమిది మందిలో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆస్పత్రిసిబ్బంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే, డజన్ మందికి పైగా గాయాలపాలయ్యారని వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
మరోవైపు, ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన తననెంతగానో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందించనున్నట్టు ప్రకటించారు.