హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఈనెల 9వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికల కోటీశ్వరుల మధ్య కొట్లాటగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు కోటీశ్వరులైన అభ్యర్థులనే బరిలోకి దించుతున్నాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం 338 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 158 మంది మల్టీ మిలియనీర్లు కావడం విశేషం. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 68 మంది ఆస్తులు రూ.8.56 కోట్లకు పైనే. అలాగే, 68 మంది బీజేపీ అభ్యర్థుల ఆస్తులు రూ.5.31 కోట్లకు పైనే. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన 42 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.46.78 లక్షలు.
ఇకపోతే... మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది (61 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 31 మందిపై తీవ్ర నేరారోపణలు ఉండడం గమనార్హం. వీరిలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కాగా, 23 మంది బీజేపీ అభ్యర్థులు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించారు.
మొత్తం అభ్యర్థుల్లో సగం మంది కంటే ఎక్కువ మంది వయసు 50 ఏళ్లపైనే కాగా ఒకరి వయసు మాత్రం 80 ఏళ్లు. అలాగే సగం కంటే ఎక్కువ మంది (63 శాతం) గ్రాడ్యుయేట్లు. మొత్తం 338 మంది అభ్యర్థుల్లో కేవలం ఆరు శాతం అంటే 19 మంది మాత్రమే మహిళలు కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.