పోస్ట్‌మ్యాన్‌కు ఫోన్ కొట్టండి.. ఆధార్ లింకు చేసుకోండి..

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (10:50 IST)
భారతీయ తంతి తపాలా శాఖ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు అనుసంధాన సేవలను ప్రారంభించింది. ఇందుకోసం కేవలం రూ.50 మాత్రమే ఫీజుగా వసూలు చేయనుంది. ఈ మేరకు పోస్టల్ శాఖ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆధార్‌ కార్డుకు ఫోన్ నంబరు అనుసంధానించడానికి ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనీ, పోస్టుమ్యాన్‌కు కానీ, పోస్టుమాస్టర్‌కు కానీ ఒక్క ఫోన్ చేస్తే, పోస్టాఫీసు సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి, ఆ పనిచేసి పెడతారనీ, ఇందుకు రూ.50 చెల్లిస్తే చాలని వెల్లడించారు. 
 
నిజానికి ఇప్పటివరకు ఈ సేవలను పోస్టల్ కార్యాలయాల్లో మాత్రమే అందించామని, ఇప్పుడు ఈ సేవలను ఇళ్ల వరకు విస్తరించామని పేర్కొన్నారు. మొత్తం 534 మంది పోస్టుమ్యాన్‌లు, 4156 మంది బ్రాంచి పోస్ట్‌మాస్టర్ల ద్వారా ఈ సేవలను అందించనున్నట్టు తెలిపారు. పోస్టుమ్యాన్ వద్ద ఉండే ఫోన్‌లోని ప్రత్యేక యాప్ సాయంతో ఈ సేవలు అందించనున్నట్టు వివరించారు.
 
ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు 14,675 మందికి ఈ సేవలు అందించినట్టు తెలిపారు. అయితే, ఆధార్‌ కోసం దరఖాస్తు, చిరునామా మార్పు, పుట్టిన రోజు తేదీల్లో తప్పులు వంటి వాటిని సరిదిద్దేందుకు మాత్రం పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు