జంతు మాంసంతో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. ఓ జంతువు నుంచి కేజీ మాంసం పొందడానికి పదకొండు కిలోల ఆహార ధాన్యాలు అందించాలి. అంతేకాకుండా అది తన జీవితకాలంలో 60 వేల నీటిని వినియోగిస్తుంది. ఇది ప్రకృతిపై పెనుభారం చూపుతుందని మేనకా గాంధీ అన్నారు. భవిష్యత్ ఆహార అవసరాలపై సీసీఎంబీ శాస్త్రవేత్తలతో చర్చించే అవకాశం రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
జంతు మాంసం తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని హైదరాబాదులో జరిగిన ఓ సమావేశంలో మేనకా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా వృక్షాల జన్యు, జీవ కణాలతో రూపొందించిన వంగడాలతో రైతులు తమ పొలాల్లో సాగు చేసిన సోయాబీన్, పప్పు ధాన్యాలతో కృత్రిమ మాంసం, పాలు ఉత్పత్తి చేసుకుంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని తెలిపారు.
జంతు మాంసానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మాంసం ఉత్పత్తి, వినియోగంపై దృష్టి సారించాలని, వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఇదే సరైన మార్గమని చెప్పుకొచ్చారు.
వాతావరణ మార్పులకు కారణమైన ఉష్ణతాపం, కాలుష్యం, విధ్వంసాన్ని అరికట్టాలంటే జంతు మాంసాన్ని నిరోదించాల్సిందేనని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని మేనకా గాంధీ ఎత్తిచూపారు. దేశంలో చిన్నారులు, గర్భిణీల్లో పౌష్టికాహారం లోపం అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తోందని చెప్పుకొచ్చారు.