మల్లెపూలు తీసుకొచ్చారని నటి నవ్యా నాయర్‌కు రూ.1.14 లక్షల అపరాధం

ఠాగూర్

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (13:25 IST)
మలయాళ నటి నవ్యా నాయర్‌కు ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు భారీ అపరాధం విధించారు. ఆమె చేసిన తప్పు ఏంటంటే... భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళుతూ తన వెంట మల్లెపూలు తీసుకెళ్లడమే. మెల్‌బోర్న్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆమె లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె బ్యాగులో 15 సెంటీమీటర్ల పొడవున్న మల్లెపూల దండను గుర్తించారు. ఇది నేరంగా పరిగణించిన కస్టమ్స్ అధికారులు రూ.1.14 లక్షల అపరాధాన్ని విధించారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
దేశంలోని వ్యవసాయం, పర్యావరణాన్ని కాపాడేందుకు విదేశాల నుంచి తాజా పువ్వులు, మొక్కలు, విత్తనాలు వంటి వాటిని తీసుకునిరావడంపై పూర్తిగా నిషేధం ఉంది. ఈ నిబంధన ఉల్లంఘించిన కారణంగా ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ అధికారులు నవ్యా నాయర్‌కు 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1.14 లక్షల అపరాధం విధించారు. ఈ విషయాన్ని మెల్‌బోర్న్‌లో జరిగిన ఓనమ్ వేడుకల్లో ఆమె వెల్లడించారు. 
 
పైపెచ్చు.. ఈ ఘటనను ఆమె చాలా సరదాగా తీసుకున్నారు. జరిమానా చెల్లించిన తర్వాత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. సంప్రదాయ కేరళ చీరలో తలలో మల్లెపూలు పెట్టుకుని విమానాశ్రయంలో నడుస్తున్న దృశ్యాలను పంచుకుంటూ ఫైన్ పడటానికి ముందు విజువల్స్.. అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల విక్టోరియా మలయాళీ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మెల్‌బోర్న్ వెళ్లినపుడు ఆమెకు ఈ వింత అనుభవం ఎదురైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు