విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ : రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

బుధవారం, 6 జనవరి 2021 (17:30 IST)
ఒకవైపు కరోనా వైరస్, ఇంకోవైపు కరోనా స్ట్రెయిన్, ఇపుడు బర్డ్‌ఫ్లూ వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. వీటి దెబ్బకు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే లక్షలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. కాకులు, బాతులు కూడా పిట్టల్లా రాలిపోతున్నాయి.
 
ముఖ్యంగా, హ‌ర్యానాలోని పంచకుల జిల్లాలో గత పది రోజుల్లో 4 లక్షలకుపైగా కోళ్లు మరణించగా, వాటిలో బర్డ్‌ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు చెప్పారు. అలాగే, పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాల‌కు కేంద్ర ప్రభుత్వం ప‌లు సూచ‌న‌లు చేసింది. 
 
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది. పరిస్థితుల‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే వైర‌స్ నివారణ చర్యలు తీసుకోవాల‌ని చెప్పింది. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర పాడి పశుసంవర్థకశాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించింది. 
 
మరోవైపు, బర్డ్ ఫ్లూ కారణంగా వందల సంఖ్యలో కాకులు మృతి చెందుతుండడంతో మధ్యప్రదేశ్ అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 100 కాకులు మృత్యువాత పడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో చికెన్ షాపులు మూసివేశారు. 15 రోజుల వరకు తెరవకూడదని అధికారులు ఆదేశించారు. అంతేకాదు, కోడిగుడ్ల అమ్మకాలపైనా నిషేధం విధించారు.
 
కేరళలోనూ దీని తీవ్రత హెచ్చుస్థాయిలో ఉంది. కొట్టాయం, ఆలప్పుళ ప్రాంతాల్లో 12 వేల బాతులు బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. వేల సంఖ్యలో బాతులు మృతి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే బర్డ్ ఫ్లూ పాకిపోతుండడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు