రాజకీయ నాటకాల్లో చంద్రబాబు దిట్ట.. ఫ్రంట్లు.. టెంట్లు ఎవరైనా వేసుకోవచ్చు : రాం మాధవ్

సోమవారం, 19 మార్చి 2018 (17:14 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేతల మాటల యుద్ధం ప్రారంభమైంది. నిన్నామొన్నటివరకు కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే విమర్శలు గుప్పిస్తూ రాగా, ఇపుడు ఏకంగా జాతీయ స్థాయి నేత, బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాం మాధవ్ రంగంలోకి దిగారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాటకాలు ఆడుతోందన్నారు. 
 
ఏపీ ప్రజల కోసం చేయాల్సినవన్నీ చేస్తామని చెప్పారు. నిన్నటి వరకు టీడీపీతో కలసి ఉన్న పవన్ కల్యాణ్, ఎందుకు దూరమయ్యారో ఓ సారి ఆలోచించుకోవాలని చెప్పారు. సొంత మామనే మోసం చేసిన ఘనత చంద్రబాబుదని... రాజకీయ గిమ్మిక్కుల్లో చంద్రబాబు ఆరితేరారని తెలిపారు. రాజకీయ నాటకాల్లో చంద్రబాబును మించినవారు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను తాము పట్టించుకున్నామని... కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఆటలు ఆడుతోందని విమర్శించారు. భారత రాజకీయాల్లో ఫ్రంట్‌లు టెంట్లు ఎవరైనా వేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో ఏ ఫ్రంట్ వస్తుందో చూద్దామని అన్నారు. 
 
రాజకీయాల కోసం ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లిందని ఆయన ఆరోపించారు. రాజకీయాల కోసం టీడీపీ నేతలు బీజేపీపై బురదజల్లాలనుకుంటున్నారని, అలాంటిది జరగనివ్వమని అన్నారు. 130 కోట్ల ప్రజలకు బీజేపీ ప్రతినిధి అని, అన్ని ప్రాంతాలు, వర్గాలకు అండగా ఉంటాని రాం మాధవ్‌ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు