మేజర్ భార్యతో స్నేహం.. పెళ్లి తిరస్కరించిందనీ మరో మేజర్ ఏం చేశాడో తెలుసా?
సోమవారం, 25 జూన్ 2018 (08:57 IST)
ఓ మేజర్.. మరో మేజర్ భార్యతో స్నేహం చేశాడు. ఈ స్నేహం బాగా బలపడింది. ఆ తర్వాత ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆమెకు పెళ్లయిందన్న విషయం తెలిసినప్పటికీ ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు. ఆమె తొలుత షాక్‌కు గురైంది. ఆ తర్వాత తేరుకుని పెళ్లికి నో చెప్పింది. దీంతో ఆగ్రహించిన ఆ మేజర్.. ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఢిల్లీకి చెందిన నిఖిల్ అనే వ్యక్తి ఆర్మీలో మేజర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు అమిత్ ద్వివేదీ అనే మరో ఆర్మీ మేజర్ భార్య శైలజతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం 2015లో ఏర్పడగా, అప్పటి నుంచి వారిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. దీంతో ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా పెళ్లాడాలని భావించాడు.
అదేసమయంలో అమిత్ ద్వివేదీకి 2015లో నాగాలాండ్‌లో పోస్టింగ్ రావడంతో భార్యను తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాతకూడా వారి స్నేహబంధం కొనసాగుతూ వచ్చింది. అప్పటికే తనకు పెళ్లయినప్పటికీ, ఆమెపై మనసు పారేసుకున్న నిఖిల్ ఆమెను పెళ్లాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
ఈ విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె నో చెప్పింది. అయినా పట్టువదల్లేదు. ఓసారి శైలజ, నిఖిల్‌లు వీడియో కాల్‌లో మాట్లాడుకుంటుండగా అమిత్ చూసి భార్యకు గట్టివార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వీరిద్దరూ కలుసుకోకుండా జాగ్రత్త పడినట్టు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో అమిత్‌కి ఢిల్లీ బదిలీ అయింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఢిల్లీకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నిఖిల్.. శైలజకు కాల్ చేశాడు. దీంతో ఆమె నిఖిల్‌ను కలుసుకునేందుకు ఫిజియోథెరపీ సెషన్ పేరుతో ఆసుపత్రికి వెళ్లింది.
అక్కడ నుంచి ఒకే కారులో బయలుదేరారు. అయితే, వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ... నిఖిల్ కత్తితో కారులోనే ఆమె గొంతు కోశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని వీధిలో విసిరేసి, ప్రమాదంగా చిత్రీకరించడానికి ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు.
అనంతరం ఆసుపత్రికి వెళ్లి, అక్కడి నుంచి సాకేత్‌లోని తన ఇంటికి వెళ్లాడు. టీవీల్లో శైలజ హత్య వార్త వస్తుండడంతో మీరట్‌కు వెళ్లిపోవాలని బయలుదేరాడు. వ్యవహారం మొత్తం చల్లబడ్డాక తిరిగి రావాలని భావించాడు. అయితే అప్పటికే నిఖిల్‌పై అమిత్ అనుమానం వ్యక్తం చేయడంతో, అటుపై దృష్టి సారించిన పోలీసులు.. నిఖిల్ హోండా సిటీ కారులో వెళ్తుండగా మీరట్‌లో వలపన్ని అరెస్ట్ చేశారు. అతనితో నిజాలు కక్కించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.