జీవికా దీదీలకు నెలకు రూ.30 వేలు ఆర్థిక సాయం : ఆర్జేడీ బిగ్ ప్రామిస్

ఠాగూర్

బుధవారం, 22 అక్టోబరు 2025 (13:39 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. వచ్చే నెలలో రెండు దశల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం జేయూడీ, బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలు ఎన్నికల హామీలను కురిపిస్తున్నాయి. ఇందులోభాగంగా బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌ బిగ్ ప్రామిస్ ఇచ్చారు. జీవికా దీదీలకు నెలకు రూ.30 వేల ఆర్థిక సాయం చేయనున్నట్టు ఎన్నికల హామీ ఇచ్చారు. పైగా, వారిని పర్మినెంట్ చేస్తామని, వారు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 
 
బిహార్‌ ఎన్నికల ముందు ఎన్డీయే సర్కారు మహిళల ఖాతాలో రూ.10 వేలు వేయడాన్ని లంచంగా తేజస్వీయాదవ్‌ అభివర్ణించారు. ఇది సాయం కాదని రుణం అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా పేర్కొన్నట్లు గుర్తుచేశారు. కాబట్టి భవిష్యత్‌లో ఆ మొత్తాన్ని తిరిగి వసూలుచేస్తారని అన్నారు. ఈ క్రమంలోనే మహిళా ఓటర్లను, మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉండే జీవికా దీదీలను ఆకట్టుకునేందుకు ఈ హామీ ప్రకటించారు.
 
బీహార్ ప్రభుత్వం 2007లో జీవిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సమూహాలు ఏర్పాటుచేయడం, వారికి రుణాలు, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడింది. బీహార్‌లో సుమారు 10 లక్షల మంది వరకు జీవికా దీదీలు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు