రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం... తాజాగా తెలంగాణలో ఏర్పడిన మహాకూటమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. కాగా... ఇప్పుడు భాజపా రాహుల్‌ని ఈ విషయంగా ఏకేస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ ధర్నాకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించడంపై భారతీయ జనతా పార్టీ రాహుల్‌ని మల్టిపుల్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఆయన త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నట్లు ప్రస్తావించింది.
వివరాలలోకి వెళ్తే... 2016వ సంవత్సరంలో పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్లను భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పోస్టు చేసింది. అందులో ‘శారద చిట్‌ఫండ్ కుంభకోణం కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు తమ డబ్బుని పోగొట్టుకున్నారనీ, అవినీతిని రూపుమాపుతానని మమతాజీ అన్నారు కానీ దానికి బదులుగా ఆమె బెంగాల్‌ను దోచుకుంటున్న వారిని కాపాడుతున్నారనీ శారదా కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణాలలో ఒకటనీ పశ్చిమ బెంగాల్‌లో సిండికేట్ రాజ్, మాఫియా రాజ్ నడుస్తుందంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ల ఫొటోను కూడా భాజపా పోస్టు చేసింది.
ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారంటూ వ్యంగాస్త్రాలు సంధించిన పార్టీ, ఇటువంటి వ్యాధితో బాధపడే వాళ్లు గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. వాటిని మరిచిపోతారు. రాహుల్ జీ.. త్వరగా కోలుకోండి అంటూ ట్వీట్ చేసింది.