పేదల పెన్నిధి సోనూసూద్‌కు ఐక్యరాజ్యసమితి పురస్కారం

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (20:03 IST)
బహుభాషా నటుడు సోనూసూద్‌కు సరైన రీతిలో గౌరవం లభించింది. లాక్ డౌన్ కాలంలో ఆయన చేపట్టిన సహాయక చర్యలు ఐక్యరాజ్య సమితిని కూడా ఆకట్టుకున్నది. తాజాగా ఆయనను ఐక్యరాజ్య సమితి స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. యునైటెడ్ నేషన్ డెవలెప్మెంట్ గోల్స్ కార్యాచరణలో భాగంగా ఆ అవార్డు ప్రదానం చేసింది.
 
సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ ఈవెంట్లో సోనుసూద్‌కు ఈ పురస్కారం అందించింది. దీనిపై సోనుసూద్ మాట్లాడుతూ దేశ ప్రజలకు చేయగలిగినంత సాయం చేశానని, ఏ ప్రయోజనం ఆశించకుండా కొద్దిపాటి సహాయక చర్యలు చేపట్టానని తెలిపారు. తన చర్యలను ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఇది ఒక అరుదైన గౌరవం అని పేర్కొన్నారు.
 
ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందడం ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని సోనుసూద్ అభిప్రాయపడ్డారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు యూఎన్ఏ డీపీకి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. కాగా ఇప్పటివరకు  ఐక్యరాజ్యసమితి అవార్డు హాలీవుడ్ ప్రముఖులు లియోనార్డో డికాప్రియో, ఏంజెలినాజోలీ, పుట్బాల్ లెజెండ్  డేవిడ్ బెక్హోమ్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలను వరించింది. ఇప్పుడు సోనుసూద్ కూడా వీరి సరసన చేరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు