పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్న హిండెన్‌బర్గ్ నివేదిక - మళ్లీ వాయిదా

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (12:34 IST)
పార్లమెంట్ ఉభయ సభలను హిండెన్‌బర్గ్ నివేదిక కుదిపేస్తుంది. మరోవైపు అదానీ గ్రూపు కంపెనీలు షేర్లు రోజురోజుకూ పతనమైపోతున్నాయి. దీంతో దేశీయస్టాక్ మార్కెట్‌ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. ఈ అంశాలన్నింటిపై చర్చ జరపాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనికి పాలక పక్షం ససేమిరా అంటుంది. ఫలితంగా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 
 
బడ్జెట్ వార్షిక సమావేశాల్లో భాగంగా, సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వగా.. ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిపేందుకు విపక్షాలు సహకరించాలని సభాపతులు సూచించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనలతో ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. 2వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపాల్సి ఉంది. అయితే, అదానీ షేర్ల పతనం అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో గత మూడు రోజులుగా ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. 
 
అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ గతవారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు