యడ్యూరప్ప మళ్లీ జైలుకెళ్లాల్సిందేనా? కారణం అదేనా?

ఆదివారం, 20 మే 2018 (10:31 IST)
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ఏకం కావడంతో మెజారిటీ లేకపోయినా.. కర్ణాటక సీఎంగా మూడు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప.. తన పదవికి రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని 28 సీట్లలో గెలిపిస్తానని బలపరీక్ష సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
 
ఈ ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురయ్యారు. చివరికి సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తాను విఫలమయ్యానంటూ రాజీనామాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లిన యడ్యూరప్ప మళ్లీ జైలుకెళ్లే ఆస్కారం వుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. 
 
తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విశ్వాస పరీక్షను ఎదుర్కొనే ముందు, యడ్యూరప్ప స్వయంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, వారిని ప్రలోభాలకు గురి చేయాలని చూశారని.. ఇందుకు సంబంధించిన ఆడియోలు బయటికి రావడంతో యడ్యూరప్ప జైలుకెళ్లే సూచనలున్నాయని తెలుస్తోంది. 
 
యడ్యూరప్పతో పాటు శ్రీరాములు, మురళీధర్ రావు, గాలి జనార్దన్ రెడ్డి తదితరులు కోట్ల కొద్దీ డబ్బు, మంత్రి పదవులు ఇస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోలను కాంగ్రెస్ బహిర్గతం చేసింది. 
 
ఇంకా కాంగ్రెస్, జేడీఎస్ వద్ద బీజేపీ నేతలకు చెందిన ఆడియో క్లిప్ లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆడియో లీకులతో బీజేపీ బండారం బట్టబయలుకాగా, దీనిపై రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే యడ్యూరప్పపై పోలీసు కేసు పెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే కనుక జరిగితే యడ్డీ మళ్లీ జైలుకెళ్లాల్సి వస్తుందేమో..!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు