ఈ పరిస్థితుల్లో ప్రధాని మోడీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు మోడీకి పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయిందని, కరోనాను ఎదుర్కొనేందుకు నిధులు అందించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. పశ్చిమ బెంగాల్ జీడీపీ పడిపోయిందని ఆమె చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించారు. కొవిడ్-19 కట్టడికి ఇది ఉపయోగపడుతుందని, కరోనా గురించి ప్రభుత్వం అందిస్తోన్న సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలకంగా మారిందన్నారు.
కర్ణాటకలో కొవిడ్-19 కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో కరోనా కట్టడి వ్యూహాలను వివరించానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. కరోనాపై పోరాడే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భఘెల్ మోదీకి చెప్పారు. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు.
కాగా, పంజాబ్, ఒరిస్సా ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడగించిన విషయం తెల్సిందే. అలాగే, తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తదితర రాష్ట్రాలు కూడా ఈ లాక్‌డౌన్ పొడగింపునకే మొగ్గుచూపాయి.