మహారాష్ట్రలో తీరం దాటిన నిసర్గ తుఫాను

బుధవారం, 3 జూన్ 2020 (13:59 IST)
మహారాష్ట్రలో నిసర్గ తుఫాను తీరందాటింది. రాష్ట్రంలోని రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద నిసర్గ తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యల్లోభాగంగా పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయించాయి. 
 
రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను దృష్ట్యా కొన్ని రైళ్లు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ముంబైలో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులోకి తీసుకువచ్చారు. ముంబైలో రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు పుణెలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోయి, ప్రజలు బయటకా రావడానికే భయపడుతున్న వేళ ఈ నిసర్గ తుఫాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ముఖ్యంగా, గత వందేళ్ళ తర్వాత ముంబై మహానగరంపై అత్యంత తీవ్ర తుఫాను విరుచుకుపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ తుఫాను ముందస్తు చర్యల్లోభాగంగా, ముంబై తీర ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వం, అత్యవసర బృందాలను రంగంలోకి దించింది. ముంబై తీర ప్రాంతాల్లో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రపు అలలు సుమారు 6 అడుగుల ఎత్తుతో ఎగసి పడుతున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరింత వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభించారు.
 
కాగా, ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. 'నిసర్గ' ప్రభావం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, మరో రెండు రోజుల పాటు ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. లాక్డౌన్ కారణంగా పునఃప్రారంభమైన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, మరో మూడు రోజుల పాటు మూసి ఉంచాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు