అర్నబ్‌కు బెయిల్‌ తిరస్కరణ

మంగళవారం, 10 నవంబరు 2020 (07:07 IST)
రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామికి బాంబే హైకోర్టు బెయిల్‌ తిరస్కరించింది. దీని కోసం స్థానిక కోర్టుకు వెళ్లాలని చెప్పింది. 2018లో రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో డిజైన‌ర్‌ అన్వే నాయక్‌తోపాటు ఆయ‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆర్కిటెక్ట్ కుమార్తె అద్యా నాయ‌క్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 4న అర్నబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేశారు. ఆ మరునాడు ఆయన బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్న కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం శనివారం విచారణ జరిపిన బాంబే హైకోర్టు దీనిపై సోమవారం ఆర్డర్‌ ఇస్తామని చెప్పింది.

అలాగే సెషన్స్‌ కోర్టును కూడా అర్నబ్‌ ఆశ్రయించవచ్చని, ఆయన బెయిల్‌ పిటిషన్‌పై నాలుగు రోజుల్లో ఆ కోర్టు నిర్ణయించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన రాయగఢ్‌ సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
మరోవైపు అర్నబ్‌ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అర్నబ్‌ తరుఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్ సాల్వే, అబాద్ పోండా వాదించారు. ఆర్కిటెక్ట్ ఆత్మహత్య కేసును తిరిగి తెరిచే అంశంపై పోలీసులు కోర్టు అనుమతి పొందలేదని అన్నారు.

ఈ నేపథ్యంలో అర్నబ్‌ అరెస్ట్‌ అక్రమమని వారు ఆరోపించారు. కాగా న్యాయవాది అమిత్ దేశాయ్ మహారాష్ట్ర ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసిన తర్వాత మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరుస్తారని చెప్పారు.

ఆ మెజిస్ట్రేట్‌ జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆ వ్యక్తి అరెస్ట్‌ అక్రమం కాదన్న సంగతి అర్థమవుతుందని అన్నారు. దీంతో అర్నబ్‌ బెయిల్‌ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీని కోసం సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. 
 
అయితే బాంబే హైకోర్టు విచారణ జరుగుతుండగానే అర్నబ్‌ గోస్వామి బెయిల్‌ కోసం రాయగఢ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు దిగువ కోర్టుకు నాలుగు రోజుల సమయం ఇవ్వడంతో అర్నబ్‌ బెయిల్‌ అంశం శుక్రవారం తేలవచ్చని తెలుస్తున్నది.

దీంతో దీపావళి పండగ వరకు ఆయన రాయ్‌గ‌ఢ్ జిల్లాలోని త‌లోజా జైలులో ఉండనున్నారు. మరోవైపు ఈ కేసులో అర్నబ్‌ను ప్రశ్నించేందుకు ఆయన కస్టడీ కోసం పోలీసులు రాయగఢ్ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు