అత్యవసరంగా ల్యాండ్ అయిన కేంద్ర మంత్రి విమానం... 150 మంది ప్రయాణికులు క్షేమం

ఆదివారం, 4 జూన్ 2023 (16:28 IST)
కేంద్రమంత్రి ఒకరు ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా కిందకు దించేశారు. ఈ ఘటన అస్సొంలోని గౌహతిలో జరిగింది. ఆదివారం ఉదయం కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి రామేశ్వర్‌ తెలి, మరో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని గౌహతి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.
 
దీనిపై మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ, తాను ఇంకా గౌహతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నట్లు తెలిపారు. 'నేను భాజపా ఎమ్మెల్యే ప్రశాంత్‌, తెరస్‌ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరాను. నాకు దులియాజన్‌, టింగ్‌ఖాంగ్‌, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. 
 
మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లో ఉన్న తర్వాత డిబ్రూఘర్‌‌లో దిగాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గౌహతిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేము సురక్షితంగా ఉన్నాం. మా విమానం మరోసారి గాల్లోకి ఎగరడానికి వీలుపడదని విమానాశ్రయ అధికారులు చెప్పారు అని తెలిపారు. 
 
మరోవైపు డిబ్రూఘర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయాన్ని గౌహతి ఎయిర్‌పోర్టు వర్గాలు కూడా ధ్రువీకరించాయి. కాగా, ఈ విమానంలో కేంద్ర మంత్రితో పాటు 150 మంది ప్రయాణికులు ఉండగా వీరంతా సురక్షితంగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు