డోలా 650 మాత్రలు రాసేందుకు వైద్యులకు రూ.1000 కోట్ల మేరకు నజరానా ఇచ్చినట్టు తాజా ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. పైగా, ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసింది. న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరిపి... ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూ వ్యాఖ్యానించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు పది రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ అంశంపై డోలో ఫార్మా కంపెనీ స్పందించింది. డోలో 650 మాత్రల తయారుదారు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు స్పందిస్తూ, వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇచ్చారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు.
కోవిడ్ సమయంలో డోలో మాత్రల కోసం మేము రూ.1000 కోట్లు ఖర్చు చేశామని చెప్పడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. గత యేడాదిలో అత్యధికంగా అమ్ముడైన ఈ బ్రాండ్ ద్వారా తమకు రూ.350 కోట్లు వచ్చాయని, అలాంటిది దీని కోసం మేం రూ.1000 కోట్లు ఎలా ఖర్చు చేస్తాం" అని ఆయన ప్రశ్నించారు.
తమ బ్రాండ్ దశాబ్దానికి పైగా ప్రసిద్ధి, విశ్వసనీయం బ్రాండ్‌గా మార్కెట్‌లో బ్రాండ్ లీడర్‌గా ఉందన్నారు. కరోనా సమయంలో ట్రీట్మెంట్ ప్రొటోకాల్ ప్రకారం జ్వరాన్ని తగ్గించే మాత్రగా డోలో 650 మరింత ప్రాచూర్య పొందిందని తెలిపారు.