భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది.
స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. పొట్టభాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు ఆహారం తినిపిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి దీనస్థితిని ముఖ్యమంత్రికి లేఖలో వివరించారు.