పహెల్గాం ఉగ్రదాడి చేసిన ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాలు మోపలేని కారడవుల్లో వారిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకుని ప్రపంచం ముందు నిలబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు ఆహారం, నివాసం సాయం చేసిన 23 ఏళ్ల అహ్మద్ మాగ్రే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తానే ఉగ్రవాదులకు ఆహారం, నివాసం ఏర్పాటు చేసినట్లు అతడు అంగీకరించాడు.
ఉగ్రవాదులు ఎక్కడ వున్నారో ఆచూకి చూపిస్తానంటూ భద్రతా దళాలను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాడు. కుల్గాంలోని టాంగ్ మార్గ్ ప్రాంతంలోని అడవిలో వారు వున్నారంటూ అటు తీసుకుని వెళ్లాడు. పోలీసులు, సైన్యం అతడిని అనుసరించాయి. అలా కొంతదూరం వెళ్లాక నది ప్రవాహం దాటాల్సి వచ్చింది. అక్కడ ఎంతమాత్రం ఆలోచించకుండా ఆచూకి చూపిస్తానన్న వ్యక్తి గబుక్కున ప్రవాహంలో దూకేసాడు. తప్పించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి నదీప్రవాహంలో మునిగి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.