సర్జికల్ స్ట్రైక్ : సోషల్ మీడియాలో ప్రచారం... ఆర్మీ వినతి

బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:51 IST)
వాయుసేన మెరుపుదాడుల నేపథ్యంలో భారతదేశమంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిచోటా ప్రజలు స్వీట్లు పంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వాయుసేన పైలెట్లపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇదేసమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫలానా పైలెట్లు ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్నట్లు ఫోటోలు రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.
 
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక పైలెట్ ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయం కొన్ని టీవీ ఛానెల్‌లలో కూడా ప్రసారం కావడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగి నేరుగా వెళ్లి వారిని అభినందించాలని భావించారు. అయితే ఆ పైలట్ ఎవరో తెలియనందున కొన్ని మీడియా సంస్థలు హైదరాబాద్‌లోని కేంద్ర రక్షణ శాఖ వర్గాలను సంప్రదించగా తమ వద్ద ఆ సమాచారం లేదని తెలియజేసారు. 
 
ఒకవేళ తమ వద్ద ఆ సమాచారం ఉన్నప్పటికీ కూడా భద్రతా కారణాల రీత్యా వెల్లడించడం కుదరదని స్పష్టం చేసారు. అదేకాకుండా సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్న ఏకైక మహిళ అంటూ ఒక మహిళా పైలట్ ఫోటోలతో ఉన్న పోస్ట్‌లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని, అటువంటి దాడుల్లో పాల్గొన్న వారి వివరాలు వెల్లడించే ఆస్కారమే లేదని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు